హైదరాబాద్, వెలుగు: క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (వైఐపీఈఎస్యూ)ని ఏర్పాటు చేస్తున్నట్లు స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. శాసన మండలిలో సభ్యులు మహేశ్ గౌడ్, బల్మూరి వెంకట్, శ్రీపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వైఐపీఈఎస్యూలో స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పరిశోధన, శాస్త్రీయ శిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాల కోసం కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభను వెలికితీసేందుకు మైదానాల అభివృద్ధి, స్కూల్ స్థాయి నుంచే ప్రతిభా అన్వేషణ చేపడతామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 145 మందికి రూ.16.60 కోట్లు అందించామని, స్పోర్ట్స్ కోటా కింద 304 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని మంత్రి చెప్పారు.
క్రీడా అకాడమీలను 6 నుంచి 19కి పెంచామని, గచ్చిబౌలి స్టేడియాన్ని రూ.700 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో రూ.272 కోట్ల అంచనా వ్యయంతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. హాకీ ఇండియా లీగ్, వరల్డ్ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ, టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లను రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
విజయ డెయిరీని బలోపేతం చేస్తాం
విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలుస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం శాసనమండలిలో విజయ డెయిరీ పాల సేకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. లీన్ సీజన్ కారణంగా పాల సేకరణలో స్వల్ప తగ్గుదల నమోదైందని మంత్రి చెప్పారు. 2023–24లో రోజుకు సగటున 3.60 లక్షల లీటర్లు, 2024–25లో 4 లక్షల లీటర్లు, 2025–26లో 3.36 లక్షల లీటర్ల పాలను సేకరించినట్లు తెలిపారు. పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని, దేశంలోనే అత్యధిక పాల ధరను తెలంగాణ రైతులకు అందిస్తున్నామని పేర్కొన్నారు.
విజయ డెయిరీ ఆధునికీకరణ, నాణ్యమైన పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ పెంపుపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రైతులకు బ్యాంకు రుణాల ద్వారా పాడి గేదెలను అందించి పాల ఉత్పత్తిని పెంచుతామని తెలిపారు. విజయ డెయిరీకి ఆదాయం పెంచేందుకు పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
